Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

2- భాగవత నిర్వచనములు

అష్టాదశ పురాణములలో పేర్కొనబడిన భాగవతము శ్రీ మన్నారయణ అవతార కథలను వివరించు శ్రీ మహా భాగవతమా?దేవీ మహాత్మ్యమును వర్ణించు దేవీభాగవతమా? అను సందేహము పండితులకు కలిగి వాదోపవాదములు పెక్కులు జరిగినవి. ఈ సందేహ నివృత్తికై భాగవత నిర్వచనములను పరిశీలింపవలెను.

1. ప్రథమ నిర్వచనము

ప్రథమ నిర్వచనము మత్స్యపురాణమున క్రింది విధముగా తెల్పబడినది.

శ్లో|| యత్రాధికృత్య గాయత్రీం

వర్ణ్యతే ధర్మవిస్తరః

వృత్రాసుర వధోపేతమ్‌

తద్భాగవత మిష్యతే -మత్స్యపురాణము

ఈ శ్లోకము నాంధ్రీకరించుచు పోతన ఇట్లు వ్రాసెను. 'సత్యం పరం రధీమహి' గాయత్రి నధికరించి థర్మవిస్తరంబున వృత్రాసుర వధంబును నెందు జెప్పంబడు నదియ భాగవతము' అనగా ఎ) గాయత్రి బి) వృత్రాసురవధ సి) ధర్మవిస్తరము డి) సత్య పరం ధీమహి అను మంత్రము ఈ నాలుగు భాగవత నిర్వచనమున ఉండుటచే అవి ప్రస్తుతము చర్చనీయాంశములు.

ఎ) గాయత్రి - భాగవత నిర్వచనము: భాగవతనిర్వచనమున మొదటి చర్చనీయాంశము గాయత్రి. ఒక వచనముతప్ప. శ్రీ మహాభాగవతమున గాయత్రి ప్రసక్తియే అగుపించదు. ఆ వచనములో భాగవతము 'నిగంబునన్‌ బోలె గాయత్రీ విరాజిత' మని చెప్పబడినది.అనగా వేదములవలె గాయత్రిని కలిగియున్నదని అర్థము. వేదద్రష్టలగు ఋషులయందు పశ్యంతి కనులు దెరచుటచేత మనస్సు అపేక్షలేక స్వయముగా ఇంద్రియములకు గోచరముగాని విషయములను కూడ వారు చూడగల్గిరి. వేద వాఙ్మయము పశ్యంతీ మూలము. లోక వాఙ్మయము వైఖరీ మూలము. వేద వాఙ్మయము ప్రమాణము లోక వాఙ్మయ మప్రమాణము. అది యుక్త్యాదులపై ఆధారపడి యున్నది. శ్రీమన్నారాయణుడు భాగవతదైవము. భాగవతము పంచమవేదము. గాయత్రి వేదమాత. అయినచో వేదమాత యగు గాయత్రి. పంచమ వేదమైన భాగవత దైవమగు ఆదినారాయణుడు, ఒకే పరతత్త్వమా? 'ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి' అనుటచే ఉన్నది ఒకే పరతత్త్వమే కాబట్టి నామభేదమేకాని రెంటింటి తత్త్వము ఒకటేనని నిరూపించవచ్చును. త్రిపదా గాయత్రి మంత్ర మునకు 24 అక్షరములు కలవు ఇవి 24 తత్త్వములను సూచించును. అట్లే నారాయణునకు కేశవాది 24 నామములు కలవు. కేశవాది నామములు పురాణచమమున కుపయోగించెదరు.

శ్లో|| కర్మేంద్రియాణి పంచైవ. పంచబుద్ధీం ద్రియాణిచ

పంచబుద్ధీంద్రియా ర్థంశ్చ, భూతానాం చైవ పంచకమ్‌

మనో బుద్ధిస్త ధైవాత్మా గాయత్య్రా అక్షరాణి చ

ప్రణవం పురుషం విద్ధి సర్వగం పచంవిం శకమ్‌ ||

-విష్ణుధర్మోత్తర పురాణము

భూతపంచకము - 5

తన్మాత్రపంచకము - 5

బుద్ధిచిత్తాహంకారములు - 3

కర్మేంద్రియపంచకము - 5

జ్ఞానేంద్రియ పంచకము - 5

మనస్సు - 1

24

ఈ గాయత్రి 24 తత్త్వములను కేశవాది 24 నామములు సూచించు ననుటకు నిదర్శనముగా గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశికలో గాయత్రీ మంత్రాక్షరములను కేశవాది 24 నామములతో జోడించి న్యాసముచేయు విధానము విధింపబడి యుండుటచేత ఆదినారాణునకును గాయత్రికిని అభేదమని తెలియుచున్నది. కావున వేదమాతయగుగాయత్రి, పంచమ వేదమగు భాగవత దైవమైన ఆదినారాణుడు ఒకే పరతత్త్వమనుటయే భావ్యము.

2 గాయత్రి-భాగవత ద్వితీయ నిర్వచనము :

బాగవతకము శ్రీమన్నారాయణుని అవతారములను వర్ణించినది

గాయత్రి ఆదినారాయణుడు ఒకే పరతత్త్వమని నిరూపించుటకు భాగవత ద్వితీయ నిర్వచనమును పరిశీలింతము. భాగవతాఖ్యకల్పతరువు శ్రీ మహాభాగవతమున ఇట్లు నిర్వచింపబడినది.

మ|| లలితస్కంధము. కృష్ణమూలము శుకాలా పాభిరామంబు మంజు

లతా శోభితమున్‌. సువర్ణసుమన స్సుజ్ఞేయమున్‌. సుందరో

జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై,

వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్‌ సద్విజశ్రేయమై.

భాగ. 1-22

పై భాగవత కల్పవృక్ష నిర్వచనముతో భారత పారిజాత నిర్వచనము పోల్చి చూడుడు.

ము|| అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థామల చ్చాయమై.

సుమహావర్గ చతుష్క పుష్పవితతిన్‌ శోభిల్లి కృష్ణార్జునో

త్తమ నానాగుణ కీర్తనాత్తఫలమై ద్వైపాయనోద్యాన జా

త మహాభారత పారిజాత మమరున్‌ ధ్రాత్రీసుర ప్రార్థ్యమై.

రామాయణ కల్పవృక్షమున ప్రతిశ్లోకము ఆదియందు గాయత్రీ మంత్రాక్షరము లుండుటను గమనింపుడు.

పై నిర్వచనములలో భాగవత కల్పవృక్షము సద్విజశ్రేయ మనియు భారత పారిజాతము దాత్రీసురప్రార్థ్యమనియు చెప్సబడినది. అనగా భాగవత భారతములు బ్రాహ్మణునిచే ప్రార్థింపతగినవి, శ్రేయస్సును గూర్చునని అని చెప్పుట విచారింపదగిన విషయము. ఎందుకనగా, 'జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః'

అన్నట్లు జన్మతో శూద్రుడుగా బుట్టి, గాయత్రీ బ్రహ్మోపదేశముచేత బ్రాహ్మణుడు ద్విజన్ముడయ్యెను. ఇట్లు ఉపనయనముచేత ద్విజన్ముడైన బ్రహ్మణుడు గాయత్రి నుపాసించును. భారత, భాగవతములు, గాయత్రి మంత్రాక్షరములుగల రామాయణము ఈ మూడును. సద్విజ శ్రేయములు ప్రార్థ్యములు నగుటచే అవి గాయత్రీ స్వరూపములేయని చెప్పుట సమంజసమే కదా.

రెండవ భాగవత నిర్వచనమగు 'లలితస్కంధము' అను పద్యమునకు భాగవతపరముగను కల్పవృక్ష పరముగను రెండర్థములు చెప్పుదురు. కాని మూడవదగు రహస్యార్థము గాయత్రి పరముగా చెప్పుటకు వీలగుచున్నది. చూడుడు

సాధరణముగ పురాణములు కల్పవృక్ష పారిజాత అశ్వత్థాది వృక్షములతో పోల్చబడినవి. ఈ వృక్షములన్నియు మన దేహములోని నాడీమండలమునకు నంకేతములని నిరూపించవచ్చును. ఉత్తర గీతలో అశ్వత్థవృక్షమును గూర్చి

శ్లో|| నానా నాడీ ప్రసరగం

సర్వభూతాంతరాత్మని

ఊర్ధ్వమూల మధశ్శాఖం

అని చెప్పబడినది. సర్వభూతముల యందలి నాడీమండలమే అశ్వత్థము. మన దేహములోని వెన్నెముకలో సుషుమ్నానాడికలదు. దీనిలో మూలాధార, స్వాధిష్ఠాన. మణిపూర, అనాహత ఆజ్ఞా, సహస్రారచక్రములు లేదా పద్మములు లేదా నాడీకూటములు కలవు. ఈ పద్మములలోని దళములలో అకారాది క్షకారాంత వర్ణములు ఉంచబడినవి. ఈ వర్ణమాల 'సర్వవర్ణే మహాదేవి' అనుటచే గాయత్రీ స్వరూపమే, ఆదినారాయణుడుకూడ అకారాది క్షకారాంత వర్ణ నిర్మిత విగ్రహుడు. ఇంకను,

శ్లో|| ఊర్ధ్వమూల మధశ్శాఖ

మశ్వత్థంప్రాహు రవ్యయం భగవద్గీత 15-1

అను భగవద్గీతా శ్లోకము ననుసరించి అశ్వత్థవృక్షమునకు 'ఎగువ వెళ్ళును దిగువ కొమ్మలు కలవు.' ఇది ప్రపంచములోని సాధారణ వృక్షములకు విరుద్ధము. దీని సంకేతార్థమును ఇట్లు చెప్పవచ్చును.

మూలకందమైన మెదడును వేరుగను. వెన్నెముకలోని సుషుమ్నానాడిని (Central nervous system) స్కంధముగను, దాని ఇతర ఆవయవములకు వెడలు నాడులు కొమ్మలుగను, ఇరువైపుల వెన్నెముకను చుట్టియున్న ఇడ పింగళ నాడులను (Peripheral nervous system) తీగలుగను భావించినయెడల ఈ నాడిమండలమే తలక్రిందులుగా నున్న అశ్వత్థముల లేక పారిజాతము లేక కల్పవృక్షముగా భావింపవచ్చును. స్వామియోగానంద గురువులుకూడ ఈ సంకేతార్థమునే వెల్లడించిరి. ఇది పిండాండ స్వరూపము. దీనిలోని షట్చక్రములే బ్రహ్మాండమునందలి షట్చక్రములతో పోల్చబడినవి.

కల్పవృక్షము దేవలోకముననున్న దందురు. కాని భాగవత కల్పవృక్షము 'ఉర్విన్‌ సద్విజశ్రేయమై' యున్నది. 'లలితస్కంధము' అను భాగవత నిర్వచన పద్యమునకు కల్పవృక్షపరముగను భాగవతపరముగను రెండర్థములను చెప్పుట వాడుకలో నున్నదని చెప్పితిని. గాయత్రిపరముగా మూడవ రహస్య సంకేతార్థమును క్రింది విధముగా చెప్పవచ్చును.

లలిత స్కంధము :

ఎ) భాగవతపరముగ: భాగవతము ద్వాదశ స్కంధములుగా విభజింపబడినది. అది వాసుదేవ ద్వాదశాక్షర మంత్ర స్వరూపమని పెద్దలందురు.

బి) కల్పవృక్షపరముగ: స్కంధమనగా చెట్టుబోదె. కల్ప వృక్షము మృదువైన స్కంధము కలదని భావము.

సి) గాయత్రిపరముగ: అశ్వత్థవృక్షములో పోల్చబడిన నాడీమండలమునకు సుషుమ్నానాడి స్కంధమువలె నున్నది. లేదా స్థూల సూక్ష్మకారణ దేహములనబడు త్రిపురముల కధిదేవతయగు త్రిపురసుందరి లేక లలితాదేవి యని కొందరు భావింతురు.

కృష్ణమూలము :

ఎ) భాగవతపరముగ: భాగవతము శ్రీరామున కంకితము చేయబడినప్పటికిని షష్ఠ్యంతములు శ్రీకృష్ణపరముగా చెప్పబడినవి. దశమస్కంధ మంతయును శ్రీకృష్మలీలాఖివర్ణనమే కాన భాగవతము శ్రీకృష్ణ ప్రాధాన్యముగలది.

బి) కల్పవృక్షపరముగ: సర్వఫలప్రదుడైన పరమేశ్వరుని దయవలననే కల్పవృక్షము ఫలముల నిచ్చుచున్నది. హనుమంతుడు పారిజాత తరుమూల వాసి. కల్పవృక్షము. పారిజాతము అను పదములు పర్యాయ పదములుగా వాడబడుచుండును. పోతన కూడ 'భాగవత పారిజాత సమాశ్రయంబున' అని చెప్పికొనెను.

సి) గాయత్రి పరముగ: సహస్రారాంతర్గత శ్రీకృష్ణనామక పరబ్రహ్మమే మూలకందము. 'మూలకందం ముకుందమ్‌' అని వాడుకలో చెప్పుదురు. వృక్షమునకు తల్లివేరు ముఖ్యమైనట్లే నాడీమండలమునకు శిరస్సులోనున్న సహస్రార చక్రాంతర్గతుడగు శ్రీ కృష్ణపరమాత్మ మూలము.

శుకాలాపాభిరామంబు:

ఎ) భాగవతపరముగ : భాగవతము శుకమహర్షిచే గానము చేయబడినది.

బి) కల్పవృక్ష పరముగ : శుకమనగా చిలుక, చిలుకల ధ్వునులచే కల్పవృక్షము మనోహరమైనది.

సి) గాయత్రి పరముగ: గాయత్రి మంత్రమును సామగానములో నారదుడు మహతీవీణపై పలికించునని చెప్పుదురు. సరిగమపదని అను సప్తస్వరములు గాయత్రి మంత్రములోని వేననినారదుడు త్యాగరాజునకిచ్చి స్వరార్ణవ మనుగ్రంథమున చెప్పబడినది.

కం|| కర, రుచి, దిక్‌, పక్షంబులు

é గిరి, త్రిశత త్రివింశతియును గిరివాస యటుల్‌

వర గాయత్య్రక్షరములు

సరిగమ పదని యటంచు సప్త స్వరముల్‌.

అనగా గాయత్రిమంత్రములోని, 2,6,10,15,23,7 అక్షరములే సరిగమపదనిఅను సప్త స్వరాక్షరములై యున్నవి. త్యాగరాజు ఉపాసించినది, ఈసప్తస్వర సుందరులనేకదా ? ఈ సప్త స్వరములు 'బ్రహ్మాభివ్యంజకములు' (భాగవతము 1-129)

అనగా ఇవి పరతత్త్వమునుగూర్చి తెలుపును.వెన్నెముకకు వీణా దండమని వేరొకనామము కలదు. అదియే నారదునిమహతీవీణ అనవచ్చును. ఈ వీణాదండము లేక వెన్నెముక లేక మహతీవీణయందు వీణను మీట నక్కరలేకయే తమంతతామే సప్తస్వరములు వినిపించుచున్నవి.అందులకే త్యాగరాజు 'నాదతను మనిశంశంకరం' అన్నారు. కావునశుకాలాపశబ్దము. నాదబ్రహ్మ విద్యను సూచించును. ఇది గాక హంసోపపనిషత్తునందు దశవిధ నాదములు చెప్పడియున్నవి. ఈ నాదానుకరణమునేదేవాలయమునందలి ఢక్కమొదలగు వాద్యధ్వనులు సూచించును.

శ్రీ రమణమహర్షిమంత్రజసము చేయునప్పుడు మంత్రమూలమైన నాదానుసంధానము చేయుమని బోధించెను. తారావిద్యలోగణపతిముని ఉత్తీర్ణుడయ్యెను. తారా విద్య అనగా ప్రణవనాదము ఎడతెగక వినుట, ఉచ్చరించిన కాలమున మాత్రమే అది వినిపించును కదా? నిరంతరము వినుట ఎట్లు? రేచక పూరకములు సోహం భావముతో జరిపిన ఎడతెగక ఓంకార ధ్వని వినిపించును. కుండలినీశక్తిప్రకోపించును. కాబట్టి 'ఆలాప అభిరామ' మనగా నాదబ్రహ్మవిద్య సూచింపబడిన దనవచ్చును.

మంజులతా శోభితమున్‌:

ఎ) భాగవత పరముగ:- మంజులత అనగా మృదుత్వము, భాగవతము మృదువైన శైలి కలిగియున్నదని భావము.

బి) కల్పవృక్షపరముగ: మంజు=మృదువైన; లత=తీగలచేత; శోభితము=ఒప్పుచున్నది.

సి) గాయత్రి పరముగ: సుషుమ్నానాడిని స్కంధముగా భావించితిమి. దానిని చుట్టుకొని లతలవలె ఇడా పింగళా నాడులున్నవి, (Perepheral nervous system) ఇడా పింగళానాడులను సూర్యచంద్ర నాడు లందురు. ఇవి సుషుమ్నానాడితో కలిసి త్రికూటస్థానమును (భ్రూమధ్యమును) చేరి ఆగిపోవును.

సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్‌:

ఎ) భాగవతపరముగ:- సువర్ణ=అగ్రవర్ణులైన ద్విజులచేతను సుమనస్‌=దేవతల చేతను; సుజ్ఞేయము=తెలిసికొనబడునది. భగవతత్త్వము ద్విజుల చేతను దేవతలచేతను తెలిసికొనబడునది.

బి) కల్పవృక్షపరముగ: కల్పవృక్షము. చింతామణి. కామ ధేనువులకు మంత్రములు కలవు. ద్విజులు దేవతలు వానిని సాధింతురవి పైవ అర్థమునే అన్వయింపవచ్చును.

సి) గాయత్రిపరముగ:- ''సర్వవర్ణేమహాదేవి'' సువర్ణ=మంచి అక్షరములచేతను, అనగా షట్చక్రముల యందుంచిన అకారాదిక్షకారాంత మాతృకా వర్ణముల చేతను; షట్చక్రముల నొగదానిపై నొకటి యుంచినచో శ్రీ చక్రమేర్పడును.

సుమనస్‌=మంచిమనస్సు గలవారిచేతను. అనగా సత్వగుణము గలవారిచేతగాని, మనోవిక్షేపము తొలగించి ఏకాగ్రత సాధించినవారి చేతగాని, సుజ్ఞేయము=తెలిసికొనుబడునది.

సుందరోజ్వల వృత్తంబు:

ఎ) భాగవతపరముగ: సుందరము ఉజ్వలము అగు ఇతి వృత్తము కలది. సూర్యచంద్ర వంశముల రాజుల కథల గురించిచెప్పుట పురాణ దశలక్షణములలో ఒకటి.

బి) కల్పవృక్షపరముగ: భక్తులకు సర్వఫల ప్రదాయక మగు చరిత్రకలది.

సి) గాయత్రిపరముగ: పరమేశ్వర విషయములను. అవతారాదులను తెలుపు సుందరమైఉజ్వలమైన కథావస్తువు కలది వృత్తము పూర్ణమునకు సంకేతము.

మహాఫలంబు:

ఎ) భాగవతపరముగ: భక్తి ఫలమునిచ్చునది. ''ఎవ్వడేయామ్నాయమున్‌ విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములన్‌ దప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించు.' -భాగవతము

బి) కల్పవృక్షపరముగ: కోరినకోర్కెల నొసగునది.

సి) గాయత్రిపరముగ:మోక్షఫలము నొసగునది.

భాగవతము 'పలికిన భవహర మగునట' అని పోతన చెప్పెను 'శ్రీకైవల్య పదంబు జేరుటకై ' చింతించెను.

విమల వ్యాసాలవాలంబునై:

ఎ) భగావతపరముగ: వ్యాసమహర్షిచే రచింపబడినది.

బి) కల్పవృక్షపరముగ:- విమల=శుద్ధమైన; వ్యాస=విరివియైన; ఆలవాలము=పాదు కలది.

సి) గాయత్రిపరముగ:- విమలమై అనంతమైబ్రహ్మాండమునాక్రమించినది. విశ్వవ్యాప్తమైనది (విశ్వం విష్ణుః)

వెలయున్‌భాగవతాఖ్యకల్పతరువుర్విన్‌సద్విజశ్రేయమై

ఎ) భాగవతపరముగ: ద్విజశ్రేయ మనగా బ్రహ్మణునకు శ్రేయస్సుకూర్చునది, ద్విజు డనగా క్షత్రియుడు వైశ్యు డనికూడఅర్థముకలదు. భాగవతము ''భువన క్షేమంకరము''. లోక కల్యాణమునకై వ్రాయబడినది.

బి) కల్పవృక్ష పరముగ:ద్విజశబ్దమునకు ''పక్షి'' అను అర్థముకలదు. కల్పవృక్షముపక్షులకు నివాసస్థానము.

సి) గాయత్రిపరముగ: వేదములోని ఒక కథను గమనింపుడు ఒక వృక్షముపై రెండు పక్షులు కలవట. ఒక పక్షి సాక్షిమాత్రముగా తటస్థముగా నున్నది. రెండవదివృక్షములోని ఫలములను తినుచున్నది. అనగా సంసారవృక్షములో కష్టసుఖములు తనవిగా అనుభవించుచున్నది.ఈ పక్షులే జీవేశ్వరులు.

'ద్వా సుపర్ణా సయుజా సఖాయ,సమానం

వృక్షంపరిషస్వజాతే. తయోరన్యః పిప్పలం

స్వాద్వత్తి అనశ్నన్న న్యోభి చాకశీతి' ఋగ్వేదము

సద్విజుడనగా రజస్తమోగుణ పరిహారిణియగు భాగవతఆత్యంతిక భక్తి సిద్ధించి శుద్ధసత్త్వగుణప్రధానుడైన భక్తుడన వచ్చును. 'సత్త్వాన్‌ సంజాయతే జ్ఞానమ్‌' అను వచనుమునబట్టిఅట్టి వానికి జ్ఞావనము లభించి ముక్తి చేకూరును.

పర్యవసాన మేమనగా భాగవత దైవమైన ఆదినారాయణుడే వేదమాతయైన గాయత్రికి ప్రతిరూపముగా వివరింపబడెను. శ్రీ లలితా దేవిని 'కరాంగుంళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః'అని సహస్ర నామము పొగడుబడుచున్నది. లలితాపంచదశ మంత్రమును గుప్తగాయత్రి అని చెప్పుదురు. అనగా లలితాదేవి లేదా గాయత్రి నుండియే విష్ణువు దశావతారములు ఉద్భవించినవి. వానినే శ్రీ మహాభాగవతము వర్ణించినది. కాబట్టి వేదమాతయగు గాయత్రియు భాగవతదైవమైన ఆది నారాయణుడు ఒకే పరతత్త్వమని ఫలితాంశము.

2) వృత్రాసురవధ: భాగవతనిర్వచనము:

భాగవత నిర్వచనములో రెండవ చర్చనీయాంశము వృత్రాసుర వధ. ఈ కథ భాగవతమునందేకాక, ఋగ్వేదము, యజుర్వేదము,పరాశర సంహిత, దేవీభాగవతము, భారతము మొదలగు వాని యందు కలదు. ఋగ్వేదమున రెండుముఖ్యమైన కథలున్నవి. మొదటిది వృత్రాసుర వధ: రెండవది ఆంగిరసుల కథ, ఈ రెండిటికి సంకేతార్థము కలదు.

''Myths in Indian scriptural and puranic literature are not mere fables, designed for naive delight. Genuine myth is sacred history which had deeperrelevance to the ideals of human perfection than human history''

వేదముల యందును పురాణముల యందును చెప్పబడు కథలు చారిత్రాత్మక కథలుకావు. అవి అధ్యాత్మికాభివృద్ధికి మార్గనిర్దేశకము లైనసంకేత స్వరూపములు.

పై రెండు కథలకు సంకేతార్థములుకలవని శ్రీ అరవిందులు

'On vedas' అనుగ్రంథమున సూచించెను.

''The two stories run through the hymns as two closely connected threads of symbolic imagery and around them all the rest of vedic symblism is woven. Not that they are thecentrl ideas, but they are two main pillars of ancient (vedic) structure. When we determine their sense, we have determined the sense of the whole Rik Samhita.''

ఈ రెండు కథల సంకేతార్థము పురస్కరించుకొని వేదములోని వేదాంత తత్త్వము అల్లుకొని యున్నది. ఈకథలే అధ్యాత్మిక తత్త్వస్వరూపములు కావు. ఇవి పురాతన వేదభవనమునకు రెండు స్థంభముల వంటివి. వీని సంకేతార్థము గ్రహించిన ఎడల సమగ్ర ఋక్‌సంహితయొక్క భావమును నిర్ణయింప గలము.

మొదటికథయగు వృత్రాసురవధ అంతరార్థము లేదా సంకేతార్థము ఇంద్రియవృత్తుల నిరోధమేనని మున్ముందు చిత్రకేతూపాఖ్యాన వివరణమున నిరూపింతును. అంగిరసుల కథ సంకేతార్థము మనోవృత్తుల నిరోధమని శ్రీ అరవిందులు నిరూపించిరి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మసాక్షాత్కారము పొందుటకు తొలి మెట్టు ఇంద్రియవృత్తుల నిరోధమే యని తెలిపెను.

'తస్మాదింద్రియా ణ్యాదౌ నియమ్య భరతర్షభ'

భాగవతము భగవత్తత్త్వార్థ ప్రతిపాదకము. అతత్త్వమును తెలిసికొనుటకు ఇంద్రియవృత్తి నిరోధము ప్రథమకర్తవ్యము. మనోవృత్తి నిరోధము ద్వితీయ కర్తవ్యము. వీనిని సంకేత రూపమున తెలుపు కథలే వృత్రాసురవధ,అంగిరసుల కథ. భగవతత్త్వమును తెలుపు వేదకాముని పురాణముకాని ఇంద్రియ మనోవృత్తుల నిరోధమును గూర్చి చెప్పక తప్పదుకదా? అందులకే భాగవతమున విదుర మైత్రేయ సంవాదమున.

''ఇంద్రియంబు లీశ్వర విషయంబులైన మది సంచిత

నిళ్చల తత్త్వమైనచో, సరసిజనాభు కీర్తనమె చాలు''

అని చెపబడ్పుచున్నది.

ఎరికైనను చేతికందించుటకు భగవంతుని వద్ద మోక్షమను వస్తువులేదు. ఇంద్రియంబుల జయించి మనస్సును నిర్విషయము చేసిన కాని మోక్షము లభించదు. అందువలననే వృత్రాసురవధ వేదముల యందును సంహితల యందును పురాణముల యందును చెప్పబడియున్నది. ఆత్మ సాక్షాత్కారమునకు తొలిమెట్టగు వృత్రాసుర వధను తెలుపు ప్రతిగ్రంథము భగవత్తత్త్వార్థ ప్రతిపాదకము భాగవతమనియనవచ్చును. అందువలన వృత్రాసుర వధను దెలుపు వేదములు పురాణములు సామాన్యదృష్టిలో భాగవతములే.

సి) ధర్మవిస్తరము; భాగవత నిర్వచనము:

భాగవత నిర్వచనములో మూడవ చర్చనీయాంశము ''ధర్మ విస్తరము''. భారత, భాగవత రామాయణములు మూడును ధర్మ ప్రవచనము చేయుచున్నవి ఎ) భారతము ''ధర్మసంహిత'' యనుపేరు గాంచినది. అందులోని భగవద్గీత ధర్మ శబ్దముతో మొదలైనది. ధర్మము ''కార్యకార్యవ్యవస్థితి'' అనగా కర్తవ్య ఆకర్తవ్యములను తెలుపునదని భగవద్గీత సూచించినది. బి) రామాయణమున నాయకుడైన శ్రీ రాముడు ''ధర్మవిగ్రహుడు'' సి) ఇక భాగవతమును ధర్మవిస్తరము చేయబడినది . కాన మూడు పురాణములు ధర్మగ్రంధములు. అయినప్పటికి ధర్మమును గూర్చిన వాని దృక్పధములు విభిన్నముగా అగుపించుచున్నవి.

కర్తవ్య అకర్తవ్యములు తెలుపునది ధర్మము. మానవుని కర్తవ్యములు రెండు అవి., విధులు (Duties) భాధ్యతలు (Responsiblities) రెండింటిని పర్యాయ పదములుగ ఒకే అర్థముతో వాడుట తగదు. అవి రెండును వేరు వేరు అంశములు. ఒకవ్యక్తి గృహమునకు నిర్వర్తించవలసిన బాధ్యతలను రామాయణము తెలుపుచున్నది. తలిదండ్రులను భార్యను పిల్లలను పోషించుట వ్యక్తి మొదటిబాధ్యత (గృహస్థ ధర్మము). మానవుడు నిర్వర్తించవలసిన రెండవ బాధ్యత సంఘపరమైనది. మానవుడు సంఘజీవి. సంఘ పురోగమనమునకై వర్ణాశ్రమ ధర్మములను ధర్మబద్ధముగా నిర్వహించవలెనని భారతము సూచించుచున్నది. పై రెండు బాధ్యతలు ప్రవృత్తి ధర్మబద్ధములు. మూడవది విధి. భగవత్పరముగా తన్ను తానుద్ధరించుకొని మోక్షమును పొందుటకు చేయవలసిన కార్యములే విధులు. భగవంతునకు సమర్పించిన సర్వధర్మములు కలవాడై (సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ) నివృత్తి ధర్మము నాశ్రయించి శరణాగతుడగుట విధి. దీనినే భాగవతము దెలుపుచున్నది. ఇట్లు మూడు పురాణములు మానవుని కర్తవ్య అకర్తవ్యుములను తెలుపుచున్నవి. ప్రతివ్యక్తియు తన బాధ్యతలను విధులను నిర్వహించి తరించివలయును. భారత రామాయణ ధర్మమును ప్రవృత్తి ధర్మమని, భాగవత ధర్మము నివృత్తి ధర్మమని చెప్పుదురు. ప్రవృత్తి ధర్మమునే నివృత్తి ధర్మముగా మార్చుకొనుటకు గూడ వీలగునని ముందు వివరింతును.

''స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌''

కొంత ధర్మమాచరించినను అది మహాభయమునుండి రక్షించును.

''ధర్మఏవ మనుష్యాణాం సహాయః పారలౌకికః'' -భారతము

పరలోకమున ధర్మమొక్కటే మానవులకు సహాయపడును.

ఎ) భారతధర్మము.

వేదములో ''అధాతో ధర్మ జిజ్ఞాసా'' అన్నప్పుడు ధర్మశబ్దము యజ్ఞ యగాది కర్మల నాచరించుట స్వర్గప్రాప్తి కి మార్గమని సూచించుచున్నది. బ్రహ్మసూత్రములయందు ''అధాతో బ్రహ్మ జిజ్ఞాసా'' అన్నప్పడు బ్రహ్మశబ్దము ఆత్మానాత్మ విచారముచే కైవల్యప్రాప్తికి మార్గము సూచించుచున్నది. ధర్మఅర్థ కామములలో ధర్మమునకే అగ్రస్థానము ఇవ్వబడినది. ధర్మమార్గమున గడించిన అర్థము. ధర్మ విరుధ్ధముకాని కామమును, మానవు డాశించవలెను. అదియే సమాజ శ్రేయస్సును గూర్చును. (ధర్మవిరుద్ధముగాని కామము భగవంతునకు ప్రియము.)

ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ! '' భగవద్గీత 7-11

అర్జునా! ధర్మము ననుసరించి ఏకామముండునో అది నేనే.

భగవద్గీతలో ధర్మనిర్వచనము ''కార్యా కార్య వ్యవస్థితిః'' చెప్పబడినది, చేయదగినది. చేయకూడనిది. కర్తవ్యము అకర్తవ్యము తెలుపునది ధర్మము భగవంతుడే అధర్మ వ్యవస్థాపకుడు. ఆధర్మ పరిహారకుడు.

శ్లో|| యదా యదాహి ధర్మస్య గ్రాని ర్భవతి భారత!

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ''

భగవద్గీత-4-7

భగవంతుడు ధర్మమునకు హానికలిగినప్పుడు, ధర్మపునరుద్ధరణకై అవతిరించెదనని చెప్పెను.

భారతమున సమాజశ్రేయస్సును గోరి వర్ణాశ్రమ ధర్మాచరణము నొక్కి చెప్పబడినది. ధర్మము నశించిన సమాజము నశించును అందులకే ధర్మసంహిత యనబడు భారతమున

శ్లో|| ధారణా ద్ధర్మ మిత్యాహుః ధర్మోధారయతే ప్రజాః

యత్స్యాద్ధారణ సంయుక్తం సధర్మఇతి నిశ్చయః

''ధృ'' (ధారణచేయుట) అను ధాతువునుండి ధర్మేర్పడినది. ధర్మము వలననే ప్రజ ధారణచేయబడినది. భరింప బడుచున్నది, ధారణచేయునదే ధర్మము. అర్థ కామములు ధర్మబద్ధములై యుండవలెను. పశువులకంటెను ధర్మవర్తనుడగు మానవుడుమిన్న

శ్లో|| ఆహార నిద్రాభయ మైధునంచ

సమాన మేతత్‌ పశుభిః నరాణాం

ధర్మోభి తేశా మధికో విశేషో

ధర్మేణ హీనః పశుభిః సమానః భారతము

ఆహారము. నిద్ర, భయము, మైధునము మానవులకు పశువులకు సమానమే .కాని ధర్మవర్తనుడైన మానవుడే గొప్పవాడు. ధర్మహీనుడు పశుతుల్యుడు.

ధర్మముచేతనే అర్థకామములు కలుగునని భారతమున వేదవ్యాసుడు మొఱపెట్టుకొనెను.

శ్లో|| ఊర్థ్వ బాహు ర్విరేమేష నచకశ్చి చ్ఛృణోతి మాం

ధర్మార్థశ్చ కామశ్చ సధర్మః కిం న సేవ్యతే || -భారతము

రెండుచేతుల నెత్తికొని ఆక్రోశించుచున్నాను. కాని నా ఆక్రోశము నెవ్వడు వినడు. ప్రవృత్తి ధర్మము చేతనే అర్థకామములు కలుగును.

భాగవతము పారలౌకికమైన నివృత్తి ధర్మమునకు ప్రాధాన్యత నివ్వగా భారతము వ్యావహారిక లేక ప్రవృత్తి ధర్మమునకు ప్రాధాన్యత నిచ్చి చాతుర్వర్ణ్య ధర్మముల సూచించినది. ''స్వధర్మే నిధనమ్‌ శ్రేయః'' అను గీతావచనము స్వధర్మానుష్ఠానమున మృతి బొందినను మేలనుచున్నది. స్వధర్మానుష్ఠానముననే సిద్ధి లభించునని గీత తెలుపుచున్నది.

''స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభ##తే నరః''

భగవద్గీత-18-45

ఈ విషయములో భాగవతము కొంత అభిప్రాయభేదము కలియున్నదని ముందు వివరింతును.

శ్లో|| అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః

తే హరే ర్ద్వేషిణః పాపాః ధర్మార్థం జన్మ యద్ధరేః

-విష్ణుపురాణము

స్వధర్మోక్తములైన చాతుర్వర్ణ్య కర్మలననువదలి 'కృష్ణకృష్ణ' యని కూర్చుండువారు హరికి ద్వేషులు పాపులు. హరిధర్మ రక్షణకై అవతారమెత్తును. కాన విధ్యుక్తధర్మమును వదలరాదు.

''ధర్మక్షేత్రే కురుక్షేత్రే'' అను భగవద్గీత ఆరంభ శ్లోకమున మానవదేహమే ధర్మక్షేత్రమని తెలుపుచున్నది. అర్జునుడు క్షత్రియుడు. యుద్ధ మొనర్చుట అతని ధర్మము. క్షత్రియుడు ధర్మయుద్ధమునకు వెనుకాడరాదు.

శ్లో|| సర్వధర్మమపి చావేక్ష్య న వికంపితు మర్హసి

ధర్మ్యాద్ధి యుద్ధా చ్ఛ్రేయో7న్యత్‌ క్షత్రియస్య నవిద్యతే||

భగవద్గీత-2-31

నీవు క్షత్రియుడవు, నీ క్షత్రియధర్మము ననుసరించి యైననుచలింపకూడదు. క్షత్రియునకు మేలు గూర్చునది ధర్మముతో కూడిన యుద్ధముకన్న ఇతరము లేదని శ్రీకృశష్ణు డర్జునునకు కర్తవ్యమును బోధించెను.

ప్రవృత్తిధర్మమైన క్షత్రియ ధర్మమును పురస్కరించుకొనియే నీవు నిమిత్త మాత్రుడవు. ద్రోణాదుల జంపిన పాపము నిన్నంటదు. క్షాత్ర ధర్మానుసారముగా యుద్ధము సేయుమని శ్రీకృష్ణుడర్జునుని కోరెను.

శ్లో|| తస్మాత్వముత్తిష్ఠ యశోలభస్వ

జిత్వాశత్రూన్‌ భుఙ్‌క్ష్వ సమృద్ధమ్‌

మమైవేతే నిహతాః పూర్వమేవ

నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్‌

భగవద్గీత 11-33

ఇట్లు శ్రీకృష్ణునిపై భారముంచి అర్జునుడు చేసిన యుద్ధము కర్తవ్యరూపమైన యజ్ఞరూపము దాల్చెను. ఈశ్వరుని తిరస్కరించి చేసిన దక్షయజ్ఞము సంగ్రామరంగ మయ్యెను.

ఇంకను గీతయం దిట్లు చెప్పబడినది.

శ్లో|| యస్య నాహం కృతోభావో బుద్ధిరస్య నలిప్యతే

హత్వా7పి స ఇమాన్‌లోకాన్నహన్తి ననిబధ్యతే ||

భగవద్గీత 18-17

ఎవనికి నేను చేయుచున్నానని భావములేదో. ఎవని బుద్ధి ఆ కర్మఫలముచే అంటుపడదో, అట్టివాడులోకమందలి ప్రాణులను లౌకిక దృష్టిచే చంపిన వాడయ్యును. పరమార్థ దృష్టిచే చంపువాడు కాడు. కర్మలచే బంధింపబడువాడు కాడు.

''ధర్మోరక్షతి రక్షితః'' ఎవడు ధర్మమును పాలించునో వాడు రక్షింపబడును. ధర్మవ్యతిరిక్త కార్యములనాచరించువాడు కౌరవాదుల వలె భగవంతునిచే శిక్షింపబడును. ఒక్క పద్యములోనే భారతకథకు సారమైన పై విషయమును భాగవత మిట్లు తెలుపుచున్నది.

శా|| పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులన్‌

చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిన్‌ జపించి

భాగవతము 1-176

కౌరవులు ధర్మమును పాటింపక నిండుసభలో ద్రౌపదిని అవమానించుటచేతనే వారికి ఆయుక్షీణము కలిగెను. అందువలన వారిని శ్రీకృష్ణుడు చంపించెను. (మమైవేతే నిహతాః) మరణానంతరమున మనము సంగ్రహించిన వస్తువేదియు వెంటరాదు.

స్వర్గారోహణ పర్వమునందు ధర్మరాజు వెంటవచ్చు బంధువులు క్రిందకు పడిపోయిరి. కాని అతని వెంట ఒక కుక్క మాత్రము కడవరకు వచ్చెను. ఆ కుక్కయే ధర్మమునకు సంకేతము. ఈ కథవలన చచ్చిన తరువాత వెంట వచ్చునది ''ధర్మమే'' నని భారతము నిరూపించినది.

పుత్రునికి తపస్సుకంటె తలిదండ్రుల సేవయు. భార్యకు భర్త సేవయు కర్తవ్యమని భారతము కౌశికుని కథమూలమున నిరూపించినది. కౌశికుడను బ్రాహ్మణుడు తపస్సు చేయుచుండగా అతని పై ఒక కాకి రెట్ట వేసెను. అతడు కోపించి దానివైపు చూచియంతనే అతని తపశ్శక్తిచేత ఆ కాకి కాలిపోయెను. తరువాత కౌశికుడు భిక్షాటనమునకు వెడలెను. ఒక ఇంటివద్ద ఇల్లాలు భర్తసపర్యలో నిమగ్నురాలై భిక్ష నొసగుటకు ఆలస్యము మొనరించెను. ఆమె భిక్ష తీసుకొని రాగా కౌశికు డామెను తీక్షణదృష్టితో చూచెను. పాతివ్రత్య మహిమ చేత ఆమె జరిగినది గ్రహించి ''కాలిపోవుటకు నేను కాకిని కానని'' చెప్పి అతనిని ధర్మవ్యాధుని వద్దకు ధర్మబోధకై పంపెను. ధర్మ వ్యాధుడు తాను కటికవాడైనప్పటికిని తన వృద్ధులైన తలిదండ్రులను సేవచేసి రక్షించుచున్నానని ధర్మసూక్ష్మము తెలిపెను. కౌశికుడు వృద్ధులైన తలిదండ్రుల వదలివచ్చుట అధర్మమని గ్రహించి తపమును చాలించి వెనుకకు మరలెను. ఆధర్మ మొనర్చిన వానిని శిక్షింపక విడువరాదు. తన పుత్రులైన ఉపపాండవుల జంపిన అశ్వత్థామనుక్షాత్ర ధర్మానుసారము శిక్షింపుమని భారతమున ద్రౌపది కోరెను. కాని భాగవతమున అశ్వత్థామను క్షమింపుమని ద్రౌపది కోరెను.

కర్తవ్యము తెలియక ధర్మసందేహము కలిగినప్పుడేమి చేయవలయును? మహాత్ములనుసరించిన మార్గమే ధర్మమార్గముగ గ్రహింపవలెనని భారతము తెలుపుచున్నది.

శ్లో|| తర్కో ప్రతిష్ఠః శ్రుతయో విభిన్నాః

నైకోఋషి ర్యస్య వచః ప్రమాణమ్‌

ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం

మహాజనాః ఏన గతస్స పన్థాః భారతము (వన)

బుద్ధిబలము చేతను తర్కసహాయము చేతను ధర్మమును నిర్ణయించుటకు వీలుకాదు. శ్రుతి స్మృతులు వేరు వేరు అభిప్రాయములను సూచించుచున్నవి. ధర్మముయొక్క తత్త్వము తెలిసికొనుట వీలు కానిది. మహాత్ములు అనుసరించినమార్గమే ధర్మమార్గమని ఎంచవలెను.

భారతమునందలి పై ధర్మ నిర్వచనములను కథలను పరిశీలించినచో సమాజశ్రేయస్సు నుద్దేశించి చాతుర్వర్ణ్య ధర్మపాలనము. భాధ్యతో ధర్మనిర్వహణము కర్తవ్యమని తెలియుచున్నది. అనగా ఒకవ్యక్తి సమాజమునకు నిర్వర్తించవలసిన ధర్మమును గూర్చి భారత మెక్కువగా వివరించినదని (Duties of man in relation to the society and the world) గమనింపవలయును.

బి) రామాయణధర్మము:

రామాయణ మహాకావ్యము ధర్మ అర్థ కామముల ప్రసాదించునని బాలకాండలో చెప్పబడినది. అందులో మోక్షప్రసక్తి లేదు.

శ్లో|| తదిదం వర్త యిష్యావః సర్వం నిఖిల మాదితః

దర్మకామార్థసహితం శ్రోతవ్య మనసూయయా ||

రామాయణము ధర్మకామార్థ సహితమని పైశ్లోకము తెలుపుచున్నది. అందులకే రామాయణము ధర్మబద్ధమైన అర్థకామము పొందుటకై నిత్యపారాయణ గ్రంథమయ్యెను. ఒక్కొక్క సర్గ నిర్దిష్టఫలము నొసగునదిగా ఉమాసంహితయందు చెప్పబడియున్నది. దశరథుని గూర్చి చెప్పునపుడు ''త్రివర్గ ముపతిష్ఠాతా'' అనగా ధర్మా కామములను సేవించువాడని చెప్పబడినది. ''రామో నిగ్రహావాన్‌ ధర్మః'' శ్రీ రాముడు ధర్మవిగ్రహుడు. తాను ధర్మమార్గము ననుసరించి ఆదర్శపురుషుడు పురుషోత్తముడయ్యెను. వ్యక్తిగా తన ధర్మమును నిర్విహించెను. ఏకపత్నీ వ్రతము. సత్యవ్రతాచరణము. గురుభక్తి పిత్రు వాక్యపాలనము మొదలగు గృహస్థ ధర్మములను చక్కగా పాటించి ఆదర్శవంతు డయ్యెను. ఇవియే రామరాజ్యమునకు మూల సూత్రములు.

ము|| స్థిరమే నీ గురుభక్తి యున్‌. కరుణ, భ్రాతృప్రేమ, సత్యవ్రతా

చరణంబున్‌, పిత్రువాక్యపాలనమునున్‌, శ్లాఘ్యైక పత్నీవ్రతం

బరయన్‌ నీవగు ధర్మవర్తనములే యానంద శ్రీరామ రా

జ్యరమా శాంతికి మూలసూత్రములు. ------సువర్ణమాల

లక్షణ భరత విభీషణాదులు పురషోత్తముడైన రామునకు శరణాగతులైరి. రామయణము చాలావరకు కుటుంబమునకు సంబంధించిన ప్రవృత్తి ధర్మమునే (Duties of man to family) సూచించినదని గమనింపవలయును.

సి) భాగవతధర్మము

ఇంతవరకు భారత రామాయణ ధర్మములను విచారించితిమి. మానవుడు ధర్మవ్యతిరిక్తుడై నైతికపతనమును బొంది సంఘమునకు, కుటుంబమునకు చీడపురుగైనప్పుడు. ధర్మచ్యుతుని గానీయక భారత రామాయణములు మిత్రునివలె నీతిని బోధించి కర్తవ్య ఆకర్తవ్యములను తెలిపి. సమాజము కుటుంబముల శ్రేయస్సులను గూర్చుటకు తోడ్పడినవి. భాగవత మట్లుగాక ''సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ'' అన్న దృక్పధముతో సాగినది. అనగా ''మత్సమర్పిత సకల ధర్మస్వభావ మహిమలుగల్గి ఇతరధర్మములు విడచి'' అను భావమును అనగా భాగవతులు పాటించవలసిన నివృత్తి లేక మోక్ష ధర్మమును వివరించినది.

భాగవత ధర్మమును విచారించుటకుముందు ఇంకొకపర్యాయము ధర్మశబ్ద నిర్వచనము వేరొక దృష్టిలో పరికించవలయును. ''వేదో7ఖిలో ధర్మమూలమ్‌'' మనుస్మృతి సకలధర్మములకు వేదమే మాలము. ''విదంతి ధర్మాధర్మా వితివేదః'' వేదము ధర్మ ఆధర్మములను తెలుపును. ధర్మము 1) అభ్యుదయము 2) నిశ్శ్రేయస్సుకలిగించునని శంకర భగవత్పాదులు గీతాభాష్యమున తెలిపిరి. ''ప్రాణినాం సాక్షా దభ్యుదయ నిశ్శ్రేయ హేతు రస్య ధర్మః'' అభ్యుదయమనగా ఐహిక భోగములనుపొందుట. నిశ్శ్రేయస మనగా జీవన్ముక్తి. అందువలన ధర్మము రెండువిధములని చెప్పవచ్చును. అభ్యదయమును కలిగించునది 1)ప్రవృత్తి ధర్మము. నిశ్శ్రేయసమును కలిగించునది. 2) నివృత్తి ధర్మము.

''ద్వావిమా పథపన్థానౌ యత్రవేదాః ప్రతిష్ఠితాః

ప్రవృత్తి లక్ష్మణో ధర్మః నివృత్తశ్చ విభాషితః''

ప్రవృత్తి, నివృత్తి ధర్మములను రెండుమార్గములయందు వేదములు ప్రతిష్ఠితములు.

1) ప్రవృత్తి ధర్మము:

ప్రవృత్తి లేక ప్రవర్తన రెండు విధములు. ఇంద్రియముల సహాయమున శబ్ద స్పర్శ రూప రస గంధముల వైపు మరలుట బాహ్యప్రవృత్తి యనబడును. అనుభూతములవైన విషయములను గూర్చి విచారించుట అభ్యంతర ప్రవృత్తి అనబడును. అట్టి ఇంద్రియమనో వ్యాపారముల చేతనే అనగా బాహ్య అభ్యంతర ప్రవృత్తుల చేతనే అనగా మానసేంద్రియ ప్రవృత్తుల చేతనే మానవుడు మంచి చెడ్డలను చేయుచున్నాడు. ఇట్టి ప్రవృత్తులను లేదా ప్రవర్తనలను ధర్మబద్ధ మొనర్చినచో అభ్యుదయము నిశ్శ్రేయస్సు కలుగును. భారత రామాయణములు వర్ణాశ్రమ ధర్మబద్ధమైన ప్రవృత్తి ధర్మము నెక్కువగా బోధించి అర్థ కామ సాధన ధర్మబద్ధ మొనర్చినవి.

2 నివృత్తి ధర్మము:

భాగవతమున ధర్మ, అర్థ, కామములు ముఖ్యములు కావు. మోక్షమే ప్రధానము. ప్రహ్లాదుడు తన గురువులు ధర్మార్థకామముల గుర్చు విద్యల నుపదేశించిన అవి రాగద్వేషములచే విషయాసక్తులగువారికి గ్రాహ్యంబులని వానిని వదలెను. భాగవతము దైవసాక్షాత్కారమునకు మానవుడు నిర్విర్తించవలసిన ధర్మమును తెలుపుచున్నది. (Man's duties to God). బ్రహ్మవిద్యయే నివృత్తి ధర్మము. నివృత్తి అనగా వెనుకకు మరలుట అని అర్థము. అనగా అంతర్ముఖుడై ఆత్మానుభూతిని పొందుట. ఇట్టి నివృత్తి ధర్మమునే భాగవత మెక్కువగా బోధించుచున్నది. విశేష మేమనగా ప్రవృత్తి ధర్మమునే నిష్కామముగా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన ఆ నివృత్తి ధర్మముగా మారి నిశ్శ్రేయస్సునకు దారితీయునని భాగవతము సూచించుచున్నది. ''కర్మంబులు సంసార హేతుకంబులయ్యును. ఈశ్వరార్పితంబులై తమ్మతాము చెరుచుకొన నోపియుండును.''

-------భాగవతము

''ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు దాపత్రయంబు మానుప నౌషధంబగు'' -భాగవతము 1-110

''ఫలంబు గోరక కర్మంబు లీశ్వరునకు సమర్పణము సేయకున్న నదిప్రశస్తంబై యుండదు'' ---భాగవతము 1-98

ఇంకను భాగవతమున ధర్మవృషభమునకు తపస్సు శౌచము దయ సత్యము అను నాల్గుపాదములు గలవని సూచించెను. ఇంకను భక్తియే ధర్మార్థకామ మోక్షములకు సాధనమని తెలిపెను.

''ధర్మార్థ కామమోక్షాఖ్యం య ఇచ్ఛే ఛ్రేయ

ఆత్మనః ఏకమేవ హరే స్తత్ర కారణం పాదసేవనమ్‌''

భాగవతము 4-8-41

''ధర్మస్య ప్రభు రచ్యుతః''

''ఏతావానేవ లోకే7స్మిన్‌ పుంసాం ధర్మః పరః స్మృతః

భక్తి యోగోభగవతి తన్నామ గ్రహణాదిభిః''

భాగవతము 6-3-22

భగనన్నామ గ్రహణముచే సాధింపదగు భక్తి యోగమే పరమధర్మము.

ధర్మరాజు భీష్ముని ''కలియుగమున శ్రేష్ఠమైన ధర్మము'' ను గూర్చి ప్రశ్నించెను. దానికి భీష్ముడిట్లు బదులు పలికెను.

ఏషమే సర్వధర్మాణాం ధర్మోధిక తమో మతః

యద్భక్త్యా పుంజరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా.

భగవంతుని భక్తి పూర్వకముగా నిత్య మర్చించుటకంటె పరమధర్మ మింకొకటి లేదు.

భగవద్గీతయందును, ఫలాపేక్షరహితమై ఈశ్వరార్పణభుద్ధితో చేయు కర్మము కర్మసన్యాసమే యగుననిశ్రీకృష్ణుడు తెలిపెను. ఆట్లయినచో ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మముగా నెట్లు మారునను సందేహము కలుగవచ్చును. గీతాభాష్యమున శంకరులు ఈ మార్పును సమర్థించిరి.

''అభ్యుదయార్ధో7పియః ప్రవృత్తి లక్షణో ధర్మో వర్ణా నాశ్రమాంచ ఉద్దిశ్యవిహితః స దేవాది స్థానప్రాప్తి హేతు రపిసన్‌, ఈశ్వరార్పణ బుధ్యా అనుష్ఠీయ మానః సత్త్వశుద్ధయే భవతి. పలాభిసంవర్జితః శుద్ధ సత్వస్యచ జ్ఞాననిష్ఠా యోగ్యతా ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్యేనిచ నిశ్శ్రేయస హేతుత్వమపి ప్రతిపద్యతే.'

అనగా ''వర్ణాశ్రమముల నుద్దేశించి అభ్యుదయమునకై విధింప బడిన ప్రవృత్తి ధర్మము దేవాది లోకప్రాప్తికి హేతువై నప్పటికిని దానినిఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష రహితముగా అనుష్ఠించినఎడల సత్వశుద్ధిను కలిగించును. శుద్ధసత్త్వము లభించినవారికి జ్ఞాననిష్ఠకు తగుయోగ్యతను ప్రసాదించి జ్ఞానోదయమునకు కారణ మగుటచేతను ప్రవృత్తి ధర్మమే నిశ్శ్రేయస్సునకు కారణమగును

కర్మతంత్రు డగుచు కమలాక్షు నర్చించి

ఉభయ నియతవృత్తి నుండుచుండ

జెడును కర్మమెల శిథిలమై మెల్లవ

ప్రబలమగుచు విష్ణు భక్తి చెడదు. భాగవతము 8-126

ఇదియే భాగవత భగవద్గీతల వినూతన ధర్మసందేశము. సంసారనున నుండియు జనకుడు అశ్వపతి మొదలగువారి వలె ఈశ్వరార్పణ బుద్ధితో, నిష్కామముతో వర్ణాశ్రమ ధర్మాది విధ్యుక్త ధర్మములను భక్తితో అనుసరించవలెననియు, అదియేజ్ఞానమునకు ముక్తికి దారితీయుననియు భావము. లేని ఎడల దేహాంతమున భగవంతుడే భక్తునకు జ్ఞానముకలిగించి ముక్తి నొసగునని కొన్ని ఉపనిషత్తులు వచించుచున్నవి.

పై విచారమువలన భాగవతము మాత్రమే ముక్తికి మార్గము సూచించుచున్నదనియు, భారత రామాయణము లట్లు చేయలేదనియు భావింపరాదు. రామాయణము కుటుంబమున ఒక వ్యక్తి నిర్వర్తించవలసిన ప్రవృత్తి ధర్మము నెక్కువగా సూచించినను శరణాగతి వలన ప్రవృత్తి ధర్మమును నివృత్తి ధర్మముగా మార్చుకొనవచ్చుననియు దానితో సత్వశుద్ధి కలిగి జ్ఞానోదయ మగుననియు తెలుపుచున్నది. భారతముకూడ ఒకవ్యక్తి సమాజమునకు నిర్వర్తింపవసిన ప్రవృత్తిధర్మమును ఎక్కువగా సూచించినను, భగవద్గీత మూలమున నిష్కామ కర్మచేత ప్రవృత్తి ధర్మమును నివృత్తి ధర్మముగా మార్చుకొనవచ్చు నని సూచించుచున్నది. రామాయణము శరణాగతిని సూచించును. భారతము శీఘ్ర శరణాగతిని. భాగవతము ఆతిశీఘ్ర శరణాగతిని సూచించునని చెప్పవచ్చును.

వృక్షమునుండి ఫలము క్రిందకు పడినప్పుడు శబ్దజ్ఞానము దానిని తాకినప్పుడు స్పర్శజ్ఞానము, వాసన చూచినప్పుడు గంధజ్ఞానము, తిన్నప్పుడు రసజ్ఞానము కలుగుచున్నవి. అనగా ఇంద్రియములకు శబ్దస్పర్శ రూప రస గంధములతో సంబంధము కలిగినప్పుడు జ్ఞానముదయించును. ఇట్లు ఇంద్రియములవలన అనుభవమునకు వచ్చిన జ్ఞానమును మనస్సు స్మరించునప్పుడు మానసిక అనుభవములు (సంశయ, విపర్యయ, సంభావన, అసంభావనలు) సుఖ దుఃఖములు కలుగును. కావున బాహ్య విషయములను ఇంద్రియముల చేతను, సుఖ దుఃఖములను మనస్సుచేతను అనుభవించుచున్నాము. ఇంద్రియముల చేతను మనస్సుచేతను పొందు ఈ రెండనుభవములే గాక సాక్షి అనుభవమును మూడవ అనుభ జ్ఞానము కలదు. ఇంద్రియాంతః కరణముల నధిగముంచిన గాని ఈ అనుభవజ్ఞానము కలుగదు. (Transcendental meditioa of Sri Mahesh Yogi) దీనినే రమణ మహర్షి ''సహజస్థితి' యని తెలిపెను. ఇట్టి సమాధి స్థితినే ''యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ'' అన్నారు. ఈ స్థితిని వాక్కులు వర్ణింపజాలవు. మనస్సు గ్రహింపజాలదు. ఇట్టి స్థితిలోనే ఆత్మసాక్షాత్కారము సాధ్యమగును. జాగ్రత్తలో నిద్రపోవుట నేర్చుకొన్న సాక్షిమాత్రముగా నుండవచ్చును.

ఆత్మ ఉన్నదని చెప్పుటకుగాని, లేదని చెప్పుటకుగాని, ఉండియు లేదనుటగుగాని, లేనేలేదనుటకుగాని వీలు పడదు. అది వాక్కులకు మనస్సునకు అతీతమగుటచేత పై నాలుగు భావములకు అతీతమై అనుభ##వైక వేద్యమైయున్నది. ఈ విషయమునే భాగవతము సమర్థించుచున్నది. చూడుడు. హిరణ్యకశివునిచే హింసింపబడు ప్రహ్లాదునకు బాధలు కలుగులేదు. ఎందుకనగా ప్రహ్లాదుడు ''ఇట్టి ట్టనరాని బ్రహ్మంబు తానయై'' యుండెను. ఇట్టిట్టనరాని ఆత్మ నెఱిగినవాడే సర్వజ్ఞుడు. ఇట్టి పరమార్ధ ధర్మమునే భాగవతము ప్రతిపాదించుచున్నది. మాండూక్య కారికలలో గౌడపాదులు పై నాలుగు భావము లకాత్మ లతీతమని సమర్థించెను.

ధర్మమున కింకొక అర్థము స్వభావము. ఇది ప్రారబ్ధ కర్మము వలన ఏర్పడిన మానవప్రకృతి. ఇంద్రియములు తమ ధర్మములను లేక వృత్తులను అనుసరించును. అట్లే వాసనా మయమగు మనస్సు తన ధర్మములను లేక వృత్తులను అనుసరించును. ఈ ఇంద్రియాంతః కరణ ధర్మములో కోరికలని శ్రీ కుర్తాలం స్వాములవారు ''ఇదంతా'' అను గ్రంథమున తెలిపిరి ఇంద్రియ వృత్తులు తమోగుణ జనితము. మనోవృత్తులు రజోగుణ జనితములు. భాగవతమున నారదునకు రజస్తమోగుణ పరిహారిణియగు భక్తిజనించినదని చెప్పుట ఎంత సమంజసముగా నున్నదో గమనింపుడు. స్థూల సూక్ష్మ దేహములకు సంబంధించి ఇంద్రియ మనోధర్మములు (తమోరజో గుణములు) కారణ దేహ సంబంధమైన ఆవరణము (సత్వగుణము) తన సహజ ధర్మములు కావని అవి మాయ లేక ప్రవృతి ధర్మములని గర్తించి, అకర్తగను, అభోక్తగను, సాక్షిగనుఉండు ఆత్మధర్మము తెలిసికొనవలెను. ''సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణఁ వ్రజ'' అను గీతా వాక్యమునకు ఇంద్రియ మనోధర్మములను వదలి తాను తానుగా (ఆత్మగా) నుండ వలెనని బావము, అందులకే నైష్కర్మ్యము అనగా ఇంద్రియములతో కర్మలను చేయకుండుట కాదని శ్రీకృష్ణుడు తెలిపెను.

శ్లో|| విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః

రసవర్జ్యం రసో7ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

భగవద్గీత 2-59

ఆహారమును మానిన దేహిని విషయములుమాత్రమే విడచును. కాని వానియందలి అభిలాష విడువదు. పరమాత్మను దర్శించిన తరువాత ఆ అభిలాష నశించును. ఆత్మ సాక్షాత్కారము కలిగినప్పుడు త్రిగుణమలు తొలగును.

''సర్వధర్మాన్‌ పరిత్యజ్య'' అనుటకు వర్ణాశ్రమ ధర్మములను వదలవలెనా అని కొందరు ప్రశ్నింతురు. వారికి హరిదాసులు చెప్పుక్రింది కథ సమాధానమగును.

అక్రూరుడు గోపికల కడకేగి శ్రీకృష్ణుడు భరించరాని తల నొప్పితో బాధపడుచున్నాడయనియు దాని నివారణోపాయము గోపికలవద్దనే కలదనియు చెప్పెనట. ఆ నివారణోపాయమేమనగా గోపికల పాదధూళి శ్రీకృష్ణుని తలకుపూసిన అతని శిరోవేదన తొలగిపోవునట, కాని గోపికలు తమ పాదరజమున భగవంతుడైన శ్రీ కృష్ణుని తలపై నుంచుట అధర్మము. పాపహేతువు. నరకప్రదముకదా? అయినను గోపికలు భగవంతుని బాధానివారణమే తమ కర్తవ్యధర్మమని తాము నరకబాధనైనను సహింతుమని పాదరజము నొసగుటకు సిద్ధపడిరట. కాపట్టి గోపికలు లౌకిక ధర్మాధర్మ విచక్షణమాని భగవంతుని ప్రీతికై కర్మలనాచరించు ఆత్యంతిక భక్తులని భావము. ''సర్వధర్మాన్‌ పరిత్యజ్య'' అను భగవద్గీత శ్లోకమునకు సరియైన వివరణము తెలుపు భాగవత పద్యమును క్రింద సూచింజెదను.

''మత్సమర్పిత సకల ధర్మస్వభావ

మహిమలు గల్గి ఇతర ధర్మములు విడచి

సమత వర్తించు నప్పుణ్యతముడు ఘనుడు.''

భాగవతము 3-969

కాన గోపికలు సకలధర్మములను భగవత్పరము జేసిరి. ఉప నిషద్గర్భితమైన భాగవత ధర్మమును తెలిసినవారు 12 మంది మాత్రమే నని భాగవతమే తెలుపుచున్నది.

సీ|| #9; #9; వరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు

దిరముగా నెవ్వరు దెలియగలరు?

దేవాదిదేవుండు త్రిపురహరుం డొండె,

కమల సంభవు డొండె, కార్తికేయ

కపిల నారదు లొండె, గంగాత్మజుం డొండె

మనువొండె, బలియొండె, జనకుడొండె

బ్రహ్లాదుడొండె, నర్పాటుగా శుకుడొండె

భానుర మతియైన వ్యాసుడొండె

గాక అన్యుల తరమె? ఈ లోకమందు

నీ సుబోధంబు, సద్బోధ, మీ పదార్థ,

మీ సదానంద చిన్మయ, మీ అగమ్య.

మీ నిశుద్ధంబు, గుహ్యంబు, నీశుభంబు.

-----భాగవతము 6-178

క|| ఈ పన్నిద్దరు దక్కగ

నోపరు తక్కొరులు దెలియ నుపనిష దుచిత

శ్రీపతి నామ మహాద్భుత

దీపిత భాగవత ధర్మ దివ్యక్రమమున్‌.

-భాగవతము 6-179

భాగవత తృతీయ నిర్వచనము:

''సత్యం పరం ధీమహి''అను గాయత్రి నధికరించి భాగవత మున ధర్మవిస్తరము చేయబడినది. సత్యమును పరమును అగు పరమాత్మను (ధీమహి=ధ్యాయేమహి) ప్రార్థింపవలయును. అట్టి పరతత్త్వమే భాగవతమున వివరింప బడినదని మూడవ భాగవత నిర్వచనము. ఆ పురాణ మర్మమును వివరించినది.

సీ|| కార్యవర్గంబును కారణ సంఘంబు

నధికరించి తరించు నాత్మ తత్త్వ

మధ్యాత్మ మనబడు; నట్టి యధ్యాత్వమ్ము

దెలియజేయగ జాలు దీప మగుచు

సకల వేదములకు సారాశంమై, ఏక

మై, యసాధారణమగు ప్రభా వి

రాజకంబైన పురాణ మర్మంబును

గాఢ సంసారాంధకార పటలి

దాటగోరెడు వారికి దయ దలిర్ప

నే తపోనిధి వివరించె భాగవతము 1-56

కార్యకారణముల (Cause and effect) నధికరించు ఆత్మతత్త్వము భాగవతమున వివిరింపబడినది. ఇతి మానసికతర్కమునకు లొంగదు. భాగవత పురాణ మర్మ మిదియే. ''చదువులలో మర్మమెల్ల చదివిన'' ప్రహ్లాదుడు భాగవత పురాణ మర్మ మెరిగిన వాడు ఇట్టి ఆధ్యాత్మికమైన పరతత్త్వమే శ్రీకృష్ణ నామక పరబ్రహ్మముగా భాగవతమున వర్ణింపబడినది. శ్రీకృష్ణలీలలు సూచించు కథలను మనము భక్తిచే పఠించి భగవంతుని అద్భుతకర్మమార్గములు తెలియ వచ్చును.

ఒక ఉదాహరణమునుతీసికొందము. భగవంతుడు పంచభూతముల కతీతుడు. శివపంచాక్షరీ మత్రములోని 5 అక్షరములు సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములను, పంచభూతములను, సూచించూననియు, ప్రణవము పంచభూతముల కతీతుడైన భగవంతుని తెలుపుననియు పంచబ్రహ్మోపనిషత్తున చెప్పబడినది.

కేనోపనిషత్తున పరదేవతయగు శ్రీదేవియు పంచభూతముల కతీతురాలని తెలుపు ఆఖ్యాయిక కలదు.ఒకప్పుడు శ్రీదేవి ఇంద్రాదులకు దర్శనమిచ్చెను. అగ్ని దేవుడామెవద్ద కేగెను. ఆమె అతనిని ''నీ వెవరివని'' ప్రశ్నించెను. ''నే నగ్నిని. సర్వమును దహింపగల'' నని అగ్నిదేవుడు బదులుచెప్పెను. అప్పుడు శ్రీదేవి ఒక గడ్డిపోచను అతని ముందుంచి ''దానిని దహింపుమని'' కోరెను. కాని అగ్ని ఆ తృణమును దహింపజాలడయ్యెను. తరువాత వాయుదేవుడు శ్రీదేవిని సమీపించి ''నేను వాయుదేవుడను. నాశక్తి చే దేనినైనను కదలించి వేయ సమర్థుడ'' నని తెలిపెను. శ్రీదేవి గడ్డిపోచ నతని ముందుంచి ''దీనిని కదలింపు '' మనెను. వాయుదేవుడు ఆతృణమును కదలించుటకశక్తుడయ్యెను.

''భీషాస్మా ద్వాతః పవతే, భీషోదేతి సూర్యః భిషాస్మా దగ్నిశ్చేంద్రశ్చ. మృత్యు ర్ధావతి పంచమః 'అను వేదవచనము ప్రకారము పంచభూతములు శ్రీదేవి అధీనములై యున్నవి. నారాయణుని యధీనమున పంచభూతము లున్నవని భాగవతము తెలుపుచున్నది.

గావున నాయజ్ఞ గడవంగ నోడుట జేసి

వాయువు వీచు శిఖి వెలుంగు

నిను డుదయించునింద్రుడు వర్షించు

భయమంది మృత్యువు పరువువెట్టు.

భాగవతము 3-886

é ఈ అభిప్రాయమునే పామరజనులకు తెలుపుటకై శ్రీకృష్ణుడను పరతత్త్వము పంచభూతముల జయించెననుటకు కథలు చెప్పబడినవి.

1) యమళార్జున భంజనము.

2) నందుని వరుణలోకమునుండి గొనితెచ్చుట.

3) సాందీపకుమారిని సముద్రమునుండి గొనితెచ్చుట.

4) కార్చిచ్చును శాంతింపజేసి గోపకులను కాపాడుట.

5) తృణావర్తుని చంపుట.

మొదలగు కృష్ణలీలలు పై విషయమునే సూచించుచున్నవి. పై విధముగ సత్యము పరము అగు బ్రహ్మతత్త్వమును భాగవతము కథల మూలమున శ్రీకృష్ణ నామక పరతత్త్వముగ తెలిపినది.

తుదకు చెప్పవచ్చిన దేమనగా మత్స్యపురాణములోని భాగవత నిర్వచనములో చెప్పబడిన 1) గాయత్రి, 2)వృత్రాసురవధ, 3)ధర్మవిస్తరము, 4) సత్యము పరమునైన ఆధ్యాత్మతత్త్వము ఆ నాలుగు విషయములను భాగవతము వర్ణించినది. వేదమాత యగు గాయత్రిని నారాయణ రూపమునను, బాహ్యాభ్యంతర ప్రవృత్తుల నిరోధమును వృత్రాసురవధ సంకేతార్థముచేతను. ధ్రమవిస్తరమును నివృత్తి ధర్మము చేతను., సత్యం పరం ధీమహి అను గాయత్రిని కార్యకారణముల నధి కరించు ఆధ్యాత్మతత్త్వము చేతను వ్యక్తము చేసినది. అందువలన భాగవత నిర్వచనము ప్రకారము శ్రీ మహాభాగవతమును అష్టాదశ పురాణములలో నొకటిగా పరిగణింప వచ్చుననుట నిర్వివాదంశము.

Sri Bhagavadgeetha Madanam-1    Chapters